మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే యజమానులు, తల్లిదండ్రులపై చర్యలు
పిల్లల భద్రతే లక్ష్యం… మైనర్ డ్రైవింగ్‌ను కట్టడి చేయాలి:జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
రహదారి నిబంధనలు పాటించండి… మీ ప్రాణాలు, మీ కుటుంబ సంతోషం మీ చేతుల్లోనే
వేసవి సెలవుల నేపథ్యంలో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు సాగించాలని, ముఖ్యంగా వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. కోరారు. ఈ మేరకు వాహనదారులు మరియు తల్లిదండ్రుల కోసం ప్రత్యేక సూచనలు తెలియచేశారు.
వేసవి సెలవుల్లో మైనర్లు (18 ఏళ్ల లోపు వారు) సరదా కోసం ద్విచక్ర వాహనాలు లేదా ఇతర వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పూర్తిగా అవగాహన లేకుండా వాహనాలు నడపడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు.మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులు మరియు తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా భారీ జరిమానాలు, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి చేస్తున్నారు అనే విషయాలపై పర్యవేక్షణ అవసరమని సూచించారు. హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నియమాల పాటించడం వంటి విషయాల్లో చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని తెలిపారు. మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి వాహనాలు ఇవ్వకుండా కట్టడి చేయాలని, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ తెలియచేశారు.
రద్దీ సమయాల్లో లేదా ట్రాఫిక్ జామ్‌ల సమయంలో వాహనదారులు సహనం కోల్పోయి రాంగ్ రూట్‌లో వెళ్లడం, అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం చేయకూడదని సూచించారు. వరుస క్రమంలో వేచి ఉండి ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు పోలీసులకు సహకరించాలని కోరారు.
సుదూర ప్రయాణాలకు బయలుదేరే ముందు వాహనం టైర్లు, బ్రేకులు, ఇంజిన్ పరిస్థితిని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హైవేలపై వాహనాలను నిలపరాదని హెచ్చరించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. అతివేగం, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. పిల్లల భద్రతే లక్ష్యంగా మైనర్ డ్రైవింగ్‌ను కట్టడి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.