తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్ణంశెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించి, అనంతరం నిర్వహించిన బహిరంగ సభ మరియు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు ముఖ్యమంత్రి గారి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి గారి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. పర్యటనకు ముందుగా హెలిప్యాడ్ ప్రాంగణం, వీఐపీ రూట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్, ప్రజావేదిక, పార్కింగ్ ప్రాంతాలను జిల్లా ఎస్పీ గారు పరిశీలించి భద్రతా చర్యలను సమీక్షించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజావేదిక, హెలిప్యాడ్ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో ముందస్తు తనిఖీలు నిర్వహించారు. వీఐపీ రాకపోకల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ప్రజల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను క్రమబద్ధంగా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, ముందస్తు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయడం ద్వారా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.ముఖ్యమంత్రి గారు సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ప్రజావేదికలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొని, అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసి పర్యటనను ముగించుకుని బయలుదేరారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పటిష్టమైన ప్రణాళికతో పాటు వివిధ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం కారణంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తైందని తెలిపారు. బందోబస్తు నిర్వహణలో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది, ట్రాఫిక్ విభాగం, ప్రత్యేక బలగాలు, అలాగే సహకరించిన ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను అభినందించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలందరికీ జిల్లా ఎస్పీ గారు ధన్యవాదాలు తెలిపారు.
