తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి : –
వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో వీబీ-జీరామ్ జీ పథకం ఒక కీలక మైలురాయిగా నిలవనుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బుధవారం కొండపి నియోజకవర్గం, జరుగుమల్లి మండలం, వావిలేటిపాడు గ్రామంలో వికసిత్ భారత్ – జి రామ్ జి పథకాన్ని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుతో కలసి లాంఛనంగా ప్రారంభించారు. శ్రామికులతో కలిసి మంత్రి గడ్డపారతో మట్టి తవ్వారు. ఈ సందర్బంగా గ్రామంలో వీబీజీ రామ్ జీ పథకంపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో ఉపాధి హామీ పధకం కింద చేపట్టిన పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు ఆసక్తిగా తిలకించారు. అనంతరం సభలో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…అభివృద్ధి, సంక్షేమ ఫలాల విస్తరణే ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ల లక్ష్యమన్నారు. మహ్మాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మెరుగైన మార్పులు చేపట్టి వీబీజీ రామ్ జీ పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. కొత్త చట్టం వల్ల గ్రామీణులకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ పథకం కింద 125రోజుల పని లభిస్తుందన్నారు. ప్రాంతాల మధ్య పనులలలో వత్యాసం ఉండకుండా అన్ని ప్రాంతాలకు పనులు, నిధుల కేటాయింపులో ఏకరూపత ఉంటుందన్నారు. ఈపథకం వల్ల శ్రామికులకు మరిన్ని హక్కులు, భద్రత లభిస్తుందన్నారు. వీజీబీ రామ్ జీ పథకం దేశ గ్రామీణ అభివృద్ధికి కొత్త దిశను చూపించబోతోందని, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో వీబీ-జీరామ్ జీ పథకం ఒక కీలక మైలురాయిగా నిలవనుందన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గార్ల దూర దృష్టి, సమర్థ నాయకత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్దికాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.