తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజల ప్రాణాలు కాపాడడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడం లక్ష్యంగా పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.జిల్లాలోని ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాల వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ (PUC) ధృవీకరణ పత్రాలు, హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, అధిక వేగం, మైనర్లతో వాహనాలు నడిపించడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదాలకు కారణమయ్యే నిర్లక్ష్య డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలు ప్రాణాంతకమని హెచ్చరించారు.ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా ఐఎస్ఐ ప్రమాణాల హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వినియోగించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ప్రజల ప్రాణ భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు శిక్షల కోసం కాదు, ప్రతి కుటుంబం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడం కోసమే రూపొందించబడినవని తెలిపారు. రోడ్డు భద్రతను ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించి ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రమాదరహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.