తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ (AP State Housing Corporation Ltd) గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ (MD) గారు శ్రీ అరుణ్ బాబు గారు గురువారం మార్కాపురం జిల్లా పరిధిలోని గిద్దలూరు సబ్‌డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా ఎండి గారు కొండపేట హౌసింగ్ కాలనీని సందర్శించి, అక్కడ నిర్మాణంలో ఉన్న PMAY(U) 2.0 గృహాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి.. ఇళ్ల నిర్మాణ వ్యయం, నిర్మాణ సామగ్రి రవాణా, మరియు మౌలిక వసతులైన తాగునీటి సరఫరా తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.
సకాలంలో బిల్లుల చెల్లింపు – లబ్ధిదారుల్లో భరోసా:
లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావాల్సిన పేమెంట్ స్టేటస్‌పై ఎండి గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద దశలవారీగా చెల్లించాల్సిన నిధులు సిద్ధంగా ఉన్నాయని, ఇళ్ల నిర్మాణం నిర్దేశిత దశకు (Stage) చేరుకున్న వెంటనే బిల్లులు త్వరితగతిన విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులందరూ గృహనిర్మాణాలను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన వారిని ప్రోత్సహించారు.
అధికారులకు ఆదేశాలు:
గృహనిర్మాణ శాఖ పరంగా లబ్ధిదారులకు ఎలాంటి సహాయం కావాలన్నా, క్షేత్రస్థాయి సిబ్బంది తక్షణమే స్పందించి సకాలంలో సహాయ సహకారాలు అందించాలని ఎండి గారు అధికారులను ఆదేశించారు. ఎండి గారి పర్యటన మరియు ప్రభుత్వ చొరవ పట్ల లబ్ధిదారులందరూ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో మార్కాపురం జిల్లా హౌసింగ్ హెడ్, మార్కాపురం యం. వి.మోహన్ రావు గారు,గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ వి.రామణబాబు గారు మరియు గిద్దలూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (Dy EE) యం. కోటిరెడ్డి గారు, హౌసింగ్ ఏఈ యం. మహేశ్వరరెడ్డి గారు తో పాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.