తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :-
ఏపీ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆర్టీసీ డిపోలకు చెందిన విలువైన స్థలాలను కారుచౌకగా లీజుకు ఇవ్వడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం మార్కాపురం ఆర్టీసీ డిపోలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఏఐటీయూసీ కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో డిపో అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి షేక్ ఖాసిం మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ప్రైవేటీకరణ విధానాలు సంస్థకు, కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను పరిరక్షిస్తూ సంస్థ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.ఆర్టీసీ డిపోలలో పనిచేస్తున్న హమాలీలకు రెండేళ్ల కాలపరిమితితో లైసెన్సులు మంజూరు చేయాలని, కార్గో విభాగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, హమాలీల వేతనాలు పెంచడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచి, ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు జి. ఎల్లయ్య, సీహెచ్. రంగనాయకులు, కే. శ్రీను, ఎం. రామిరెడ్డి, బి. ప్రసాద్, జి. గురుస్వామి, ఆర్టీసీ కార్మికులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.