తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ స్కూల్‌లో సుమారు ఆరు నెలల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన ఆరో తరగతి విద్యార్థి సయ్యద్ తౌషిక్ కుటుంబాన్ని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించారు. బాధిత తల్లిదండ్రులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఒంగోలులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పుంగనూరు నుంచి ఒంగోలు వెళ్తున్న బోడే రామచంద్ర యాదవ్‌ను, మార్గమధ్యంలో బీసీవై పార్టీ ప్రకాశం జిల్లా మైనారిటీ అధ్యక్షుడు నజీర్ బాషా ఆధ్వర్యంలో సింగరాయకొండ హైవేపై కలిసి తౌషిక్ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బాధిత కుటుంబాన్ని కలిసిన రామచంద్ర యాదవ్, తౌషిక్ తల్లిదండ్రుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా “మీరు ధైర్యంగా ఉండండి.. మీకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. కానీ జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలా మీకు అండగా ఉంటాను” అంటూ కుటుంబానికి భరోసా ఇచ్చారు.అనంతరం మీడియాతో మాట్లాడిన రామచంద్ర యాదవ్, ఘటన జరిగి ఆరు నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదని ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న తల్లిదండ్రులకు అండగా నిలవాల్సింది పోయి వారిని భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ హాస్టల్‌కు అవసరమైన అనుమతులు లేవని ఆరోపించిన ఆయన, దీనిపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్నట్లు తేలితే విద్యాసంస్థతో పాటు బాధ్యత వహించాల్సిన సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.“తౌషిక్ మృతికి సంబంధించి బాధ్యులెవరో గుర్తించి వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలి. హాస్టల్ అనుమతుల అంశంపైనా విద్యాశాఖ అధికారులు స్పందించాలి. లేకపోతే బాధిత కుటుంబం తరఫున బీసీవై పార్టీ తీవ్రంగా స్పందించి పోరాటం చేస్తుంది” అని బోడే రామచంద్ర యాదవ్ హెచ్చరించారు.