పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పౌష్టికాహార పథకాల్లో అక్రమాలు, అలసత్వానికి తావులేదని ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించకపోతే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మంగళవారం సింగరాయకొండ మండలంలో పర్యటించిన ఆయన ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, స్టోర్ రూమ్‌లను పరిశీలించడంతో పాటు విద్యార్థినులతో నేరుగా మాట్లాడి భోజనం, వసతి, తాగునీటి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.సుమారు 700 మంది విద్యార్థినులు ఉన్న గురుకులంలో ఆహారం, వసతులు బాగున్నాయని విద్యార్థినులు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్టర్లు, సరుకుల నిర్వహణ పారదర్శకంగా ఉండటాన్ని అభినందించారు. వంటశాలకు మరికొన్ని ఆధునిక పరికరాలు అవసరమని గుర్తించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు.అనంతరం సింగరాయకొండలోని రెండు చౌక ధరల దుకాణాలను తనిఖీ చేసి సరుకుల నిల్వలు, పంపిణీ తీరును పరిశీలించారు. చిల్లర సమస్య లేకుండా రేషన్ దుకాణాల్లో PhonePe లేదా ఇతర QR స్కానర్ల ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని సూచించారు. లబ్ధిదారుల నుంచి అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా, బియ్యానికి బదులుగా నగదు ఇచ్చే అక్రమాలకు పాల్పడినా క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును సమీక్షించిన ఆయన, గతంతో పోలిస్తే నిర్వహణ మెరుగుపడిందని పేర్కొన్నారు. అయితే సిబ్బంది కేంద్రాలకు రాకుండా హాజరు నమోదు చేయడం వంటి చర్యలను సహించేది లేదన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని ఆదేశించారు.చివరగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని సందర్శించి వసతి, విద్యుత్, తాగునీరు, భోజన నాణ్యతను పరిశీలించారు. హాస్టల్ నిర్వహణ, ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు కొండేపి గురుకుల పాఠశాలను కూడా ఆయన తనిఖీ చేశారు.ఈ పర్యటనలో డీఎస్‌వో పద్మశ్రీ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *