ఈ నెల 5వ తేదీన వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద నీటిని చూసేందుకు వెళ్లిన దోర్నాల మండలం కటకానిపల్లి గ్రామానికి చెందిన పుప్పాల రాజ్‌కుమార్ (23), పుప్పాల వినయ్‌కుమార్ (23) ప్రమాదవశాత్తు కాలువలోకి జారిపడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మార్కాపురం డీఎస్పీ నాగరాజు గారి ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన గజ ఈతగాళ్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను తో పాటు మనుషులు వెళ్లి గాలించడానికి వీలులేని ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.ఈ నెల 6వ తేదీ ఉదయం నుంచి వెలిగొండ ఫీడర్ కెనాల్‌తో పాటు నల్లమల్లసాగర్‌లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా, 7వ తేదీ సాయంత్రం పుప్పాల వినయ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.మరో వ్యక్తి పుప్పాల రాజ్‌కుమార్ ఆచూకీ కోసం ప్రస్తుతం 15 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసు సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి, నాలుగు డ్రోన్ల సహాయంతో నల్లమల్లసాగర్ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అదనంగా, మరో 15 మంది సభ్యులతో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ఈరోజు అక్కడికి చేరుకుని గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొననుంది.నల్లమల్లసాగర్‌లోకి ఇటీవల కొత్తగా నీరు చేరడంతో, గతంలో చెట్లు, ముళ్లకంచెలు, దట్టమైన ముళ్లపొదలు ఉన్న ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు క్లిష్టంగా మారినప్పటికీ, ఎస్‌డీఆర్‌ఎఫ్ మరియు పోలీసు సిబ్బంది అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తూ ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.రాజ్‌కుమార్ ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను నిరంతరాయంగా కొనసాగిస్తూ, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.ప్రజలు కాలువ,సాగర్ పరిసర ప్రాంతాలకు అనవసరంగా వెళ్లవద్దని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటిలోకి దిగడం లేదా సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని పోలీసులు సూచించారు. పిల్లలు, యువత నీటి ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్త వహించాలని, పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *