మూలగుంటపాడు గ్రామంలోని శ్రీ చైతన్య ప్రాథమికోన్నత పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి సి.వి. రేణుక తెలిపారు.2026 ఫిబ్రవరి 14న శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో 6వ తరగతి విద్యార్థి సయ్యద్ తౌషిక్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. అనంతరం తౌషిక్ తల్లి మౌలాబీ సెప్టెంబర్ 10న పాఠశాల సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఒంగోలు సంగమిత్ర ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా, సెప్టెంబర్ 12న ఆమె మృతి చెందినట్లు తెలిపారు.ఈ వ్యవహారానికి సంబంధించి W.P.No.8899/2026 దాఖలైందని, పాఠశాల యాజమాన్యం తన అభ్యంతరాలను జిల్లా విద్యాశాఖాధికారికి సమర్పించాలని, వాటిపై విచారణ నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు సూచించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.పాఠశాల యాజమాన్యం సమర్పించిన అభ్యంతరాలపై కందుకూరు ఉప విద్యాశాఖాధికారి, సింగరాయకొండ మండల విద్యాశాఖాధికారి ద్వారా విచారణ జరిపించి నివేదిక తీసుకున్నట్లు తెలిపారు. ఆ నివేదిక ప్రకారం పాఠశాల యాజమాన్యం అన్ని షరతులను పరిష్కరించలేదని తేలినట్లు పేర్కొన్నారు.సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన అనంతరం, కలెక్టర్ సూచనలు, అధికారుల విచారణ నివేదిక, ప్రస్తుతం అక్కడ చదువుతున్న విద్యార్థుల క్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని శ్రీ చైతన్య ప్రాథమికోన్నత పాఠశాల, మూలగుంటపాడు, సింగరాయకొండ గుర్తింపును తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సి.వి. రేణుక తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *