తొలి శుభోదయం న్యూస్ కంభం:-
పాఠశాల విద్యలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు అమలు చేస్తున్న టీచ్ టూల్ కార్యక్రమంలో భాగంగా గురువారం కంభం పార్క్ వీధి పాఠశాలను ఎంఈవో టి.అబ్దుల్ సత్తార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో టీచ్ టూల్ ద్వారా ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న బోధనా ప్రక్రియను, విద్యార్థుల భాగస్వామ్యాన్ని, అభ్యసన ఫలితాలను ఆయన పరిశీలించారు.
విద్యార్థుల వయస్సు, తరగతి స్థాయి, అభ్యసన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని బోధనను సులభతరం చేయడంలో టీచ్ టూల్ లాంటి డిజిటల్ సాధనాలు ఉపాధ్యాయులకు ఉపయుక్తంగా ఉంటాయనీ,
పాఠ్యాంశాల్లోని క్లిష్టమైన అంశాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఉదాహరణలు, కథలు, చిత్రాలు, కార్యకలాపాల ఆధారంగా బోధించేందుకు టీచ్ టూల్‌ను వినియోగించవచ్చని అన్నారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని గుర్తించేందుకు వివిధ రకాల అసెస్‌మెంట్‌లు, ప్రశ్నలు, అభ్యాస కార్యక్రమాలు రూపొందించుకోవడం ద్వారా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు వీలుంటుందని వివరించారు.
విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకంలోని విషయాలను వినడం, రాయడం మాత్రమే కాకుండా ఆలోచించడం, ప్రశ్నించడం, చర్చించడం, స్వయంగా నేర్చుకోవడం, నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా ఉపాధ్యాయులు బోధనా కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. విద్యార్థులలో వెనుకబడిన అంశాలను గుర్తించి, అవసరమైన వారికి రెమిడియల్ బోధన అందించడం ద్వారా అభ్యసన అంతరాలను తగ్గించాలన్నారు.
పాఠశాలల్లో డిజిటల్ వనరుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని,విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం, తరగతి గదిలో బోధనను మరింత ప్రభావవంతంగా మార్చడం, ప్రతి విద్యార్థికి అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను అందించడం టీచ్ టూల్ వంటి కార్యక్రమాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని చెప్పారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు రేష్మాభాను బోధనా శైలిని ప్రశంసించారు. అనంతరం పాఠశాలలో డొక్కా.సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలను పరిశీలించి,విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.వి.అరుణ , ఉపాధ్యాయులు రేష్మాభాను, మార్క్ , కాశీంభాష తదితరులు పాల్గొన్నారు.