తొలి శుభోదయం న్యూస్ రామయ్యపట్నం :-
రామాయపట్నం లోని పల్లెపాలెం గ్రామాన్ని నిర్వాసితుల గ్రామాల జాబితాలో చేర్చి అక్కడున్న 400 మత్స్యకారుల కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ క్రింద పరిహారం అందించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యం. రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రామాయపట్నం పోర్టు పరిధిలోని నిర్వాసితుల గ్రామాల్లో సిఐటియు ప్రకాశం జిల్లా కమిటీ బృందం చేవూరు, కర్లపాలెం మొండివారిపాలెం, ఆవుల వారిపాలెం, సాలిపేట, రామాయపట్నం పల్లెపాలెం లలో గురువారం పర్యటించింది.ఈ పర్యటనలో భాగంగా రామాయపట్నం పల్లెపాలెం లో సభ జరిగింది. ఈ సభకు సిఐటియు జిల్లా నాయకులు జీవీబీ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సభలో సిఐటియు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కాలం సుబ్బారావు, ఎం రమేష్, రామాయపట్నం పోర్టు నిర్వాసితుల సంఘం కన్వీనర్ జి వెంకటేశ్వర్లు, చేవూరు గ్రామ నాయకులు ఇరువూరి బ్రహ్మయ్య లు నిర్వాసితులను ఉద్దేశించి మాట్లాడారు. నాయకులు మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టకు ముందు పల్లెపాలెం కు సముద్రం 300 అడుగులు దూరంలో ఉండేదని,పోర్టు నిర్మాణం జరిగిన తర్వాత 30 అడుగులకే సముద్రం ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. పల్లెపాలెంలోని ప్రజలు నిద్రాహారాలు మాని, భయభ్రాంతుల మధ్య జీవించాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. సముద్రం ప్రక్కనే ఉన్న ఎనిమిది జెల్లీ ఫిష్ షెడ్లు సముద్రంలో మునిగిపోయినవని, రెండు రొయ్యల చెరువులు మునిగిపోయాయని, సముద్రం పక్కనే ఉన్న ఇండ్లు, చెట్లు సముద్రంలో కలిసిపోయివని తెలిపారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు జరుగుతుంటే శబ్ద కాలుష్యం, సముద్రం నుంచి వచ్చే ధ్వనులతో నివాసం ఉండటానికి వీలులేని పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ఈపాటికే జిల్లా కలెక్టర్ ను, కందుకూరు సబ్ కలెక్టర్ ను, కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ని కలసి సమస్యను వివరించినప్పటికీ ఈరోజుకి సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇప్పటికైనా రామాయపట్నం పల్లెపాలెం ను నిర్వాసిత గ్రామంగా ప్రకటించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద వారికి రావలసిన పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమానికి సన్నద్ధం చేస్తామని హెచ్చరించారు.ప్రకాశం జిల్లాలో ప్రజలు ఎంతో పోరాడి సాధించుకున్న రామాయపట్నం పోర్టును 50 సంవత్సరాల పాటు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, నిర్వాసితుల గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఈనెల 4న కందుకూరు పట్టణంలోని త్యాగరాజు స్వామి గుడి మందిరంలో జిల్లా సదస్సు ను నిర్వహిస్తున్నామని, ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు, తో పాటు ఇతర నాయకులు పాల్గొని మాట్లాడుతారని, ఈ సదస్సుకు నిర్వాసిత గ్రామాలలో ప్రజలు, జిల్లా అభివృద్ధిని కాంక్షించే కార్మిక ప్రజా సంఘాల నాయకులు, పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఆభ్యుదయ కాముకులు, ప్రజాస్వామ్యవాదులు ఈ సదస్సుకు హాజరుకావాలని సిఐటియు జిల్లా నాయకులు కోరారు. ఈ పర్యటనలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందార్, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ పి. కల్పన, సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్ పల్లాపల్లి ఆంజనేయులు, సిఐటియు జిల్లా నాయకురాలు యు ఆదిలక్ష్మి, సురేష్,గుత్తి. మల్లికార్జున, ఎస్ నరసింహారావు తోపాటు కాపు ఆర్ సుధాకర్ రావు, టి పరిశుద్ధ రావు, ఆర్ రాములు, టి ప్రభావతమ్మ, సిహెచ్ సీతారావమ్మ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముందుకొచ్చిన సముద్రాన్ని, మునిగిపోయిన షెడ్లను చెట్లను పరిశీలించారు. పోర్టు నిర్వాసితుల కోసం ఇటీవల నిర్మించిన మొండి వారి పాలెం, ఆవులవారి పాలెం, సాలిపేట, కర్లపాలెం కాలనీలలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకొని, ఈనెల 4న ఉదయం 10 గంటలకు కందుకూరు సదస్సు కు రమ్మని ఆహ్వానించారు.