నర్సింగోలులో 8,500 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో రాజముద్రతో పాస్‌పుస్తకాలు అందజేత
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన కొండేపి నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఒంగోలు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుతో కలిసి సోమవారం పరిశీలించారు.కలికివాయి, బిట్రగుంట, నర్సింగోలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటనకు అనువైన స్థలాలను మంత్రులు, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం నర్సింగోలులోని శ్రీ రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి ఆలయంతో పాటు శనీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 9వ తేదీన రైతుల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.ఈ నెల 9వ తేదీన కొండేపి నియోజకవర్గంలోని నర్సింగోలులో సుమారు 8,500 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు అందజేస్తామని తెలిపారు.ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కలికివాయి, బిట్రగుంట, నర్సింగోలు ప్రాంతాల్లో మూడు స్థలాలను పరిశీలించినట్లు మంత్రి తెలిపారు. నర్సింగోలు స్థలానికి సంబంధించి జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపించనున్నట్లు వెల్లడించారు. మరో రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి కార్యక్రమం ఖరారయ్యే అవకాశం ఉందన్నారు.ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రైతులకు భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి డోలా
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొండేపి నియోజకవర్గంలోని నర్సింగోలులో పర్యటించి 8,000 మందికి పైగా రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేయనున్నట్లు తెలిపారు.‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం ద్వారా రైతులకు భూమిపై సంపూర్ణ హక్కు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు అందజేయడం ద్వారా భూ హక్కులకు మరింత భద్రత కల్పిస్తున్నామని తెలిపారు.జిల్లాలో ఇప్పటికే సుమారు 4,000 ఎకరాల నిషేధిత భూములకు సంబంధించిన గ్రామ కంఠాల క్లియరెన్స్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. నర్సింగోలు గ్రామంలో సుమారు 400 ఎకరాలకు క్లియరెన్స్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు వేల ఎకరాలకు సంబంధించిన రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేసినట్లు తెలిపారు.కలికివాయి, బిట్రగుంట, నర్సింగోలు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం నర్సింగోలులో ముఖ్యమంత్రి పర్యటన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, నాగేశ్వరరావు, విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మేరీటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
