తొలి శుభోదయం సింగరాయకొండ:-

సమాజంలో మహమ్మారిలా విస్తరిస్తున్న క్షయ వ్యాధి (టి.బి)ను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ ధీరేంద్ర కుమార్, డాక్టర్ వంశీధర్ ప్రజలకు పిలుపునిచ్చారు. DMHO డాక్టర్ టి. వెంకటేశ్వర్లు, DLATO బాలాజీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను మండల స్థాయిలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రంలో ప్రత్యేకంగా ఎఐ ఆధారిత ఛెస్ట్ ఎక్స్‌రే (AI-based Chest X-ray) పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీధర్ మీడియాతో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో టి.బి వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, తీవ్రతను అంచనా వేసి తక్షణ చికిత్స అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు.కాలుష్యం, జీవనశైలి మార్పులు, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ప్రజలు టి.బి వంటి వ్యాధులకు గురవుతున్నారని పేర్కొన్న ఆయన, గ్రామీణ ప్రజలకు అందుబాటులోనే అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ఎఐ ఆధారిత ఎక్స్‌రే యూనిట్లను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల వద్దకు తీసుకువచ్చామని తెలిపారు. దీంతో వ్యాధి నిర్ధారణ, తీవ్రత గుర్తింపు, చికిత్స ప్రారంభం అన్నీ ఒకే చోట జరుగుతాయని స్పష్టం చేశారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం భాగంగా సోమవారం బింగినపల్లి, మంగళవారం ఊళ్లపాలెం, బుధవారం పాకాల–1 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఇదే తరహా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ధీరేంద్ర కుమార్, ఎఎస్‌టీఎస్ షేక్ అబ్దుల్ నిస్సార్, ఎస్టీఎల్‌ఎస్ కె. కిరణ్ కుమార్, టెక్నీషియన్ కాలేషా, టి. శ్రీను (MPH), 104 సిబ్బంది ఏ. శ్రీకాంత్, ఏఎన్‌ఎంలు సంతోష్ కుమారి, జ్యోతి, ఆశ కార్యకర్తలు నళిని, గీతాంజలి, అస్మా, రూప, షాజిదా, ఫాతిమా తదితర వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *