తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేయడం, ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రధాన రహదారులు, కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేసి, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో, తలకు తీవ్ర గాయాలు కాకుండా ఎలా రక్షణ లభిస్తుందో అవగాహన కల్పించారు.హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే జరిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యల గురించి కూడా స్పష్టంగా తెలియజేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా, ఇటువంటి తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీసులు తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించి, హెల్మెట్‌ను అలవాటుగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
