డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఆపరేషన్ “వజ్రప్రహార్” లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, టు టౌన్ సీఐ శ్రీనివాసరావు,9 మంది సబ్ డివిజన్ ఎస్సైలతో 50 మంది సిబ్బంది కలిసి శనివారం ఉదయంఒంగోలు టౌన్ లోని వంటవారి కాలనీ మరియు ఏకలవ్య కాలనీలో వజ్ర ప్రహర్ ఆపరేషన్ (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. తనిఖీలు ముఖ్యంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లు, దుకాణాలు, ఇతర ప్రదేశాలను తనిఖీలు నిర్వహించారు.సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 25 మోటార్‌సైకిళ్లు లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తదనంతరం “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో స్థానిక ప్రజలతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. యువత, వ్యాపారులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని “గంజాయిని పారదోలుదాం – డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడుదాం” అంటూ ప్రతిజ్ఞ చేశారు. అలాగే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు,శిక్షలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తు కోసం విద్య, క్రీడలు, ఉపాధి వంటి రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం లేదా వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే గంజాయి వంటి మాదకద్రవ్యాల విక్రయం, రవాణా లేదా నిల్వపై ఎవరైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.మాదకద్రవ్యాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” కింద ఇలాంటి ప్రత్యేక చర్యలు నిరంతరం కొనసాగుతాయని ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
