తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
దోర్నాల మార్కాపురం జిల్లా పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా దోర్నాల పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, దోర్నాల ఎస్.ఐ. గారు మరియు వారి సిబ్బంది అర్ధరాత్రి సమయాల్లో అకారణంగా రోడ్లపై తిరుగుతున్న అల్లరి మూకలను మరియు లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించారు. ఈ క్రమంలో మైనర్ వాహనదారుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించారు.18 ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, ఇది వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు అని ఎస్.ఐ. గారు తీవ్రంగా మందలించారు. అలాగే అర్ధరాత్రి వేళల్లో గుంపులుగా తిరుగుతూ ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై నిఘా ఉంచామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. యువత తమ భవిష్యత్తును పాడుచేసుకోకుండా చట్టాలను గౌరవిస్తూ, బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాజ హితం కోరి నిర్వహించిన ఈ కౌన్సెలింగ్ పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.