తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలకు కట్టుబడి చిత్తశుద్ధితో అమలు చేయాలని ఏ.పీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం కందుకూరు నియోజకవర్గం కార్యకర్తల సమావేశం దువ్వూరి జాన్ అధ్యక్షతన బుధవారం స్థానిక సుందరయ్య భవన్ లో జరిగింది.ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేయడంలో చిత్తశుద్ధి లోపించిందని అన్నారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా , 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున ఇస్తామన్న ఆడబిడ్డ పథకం అమలు కాలేదని విమర్శించారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి ఏడాది మెగా డీఎస్సీ ఇస్తామని ఉద్యోగాలు వచ్చేలోపు నిరుద్యోగులందరికీ భృతి కల్పిస్తామని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఏడాదికి మూడు సిలిండర్లు అన్న మాట ఎటు పోయిందోనని ఎద్దేవా చేశారు. నేడు యుద్ధం పేరుతో కేంద్రం గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ 60, వాణిజ్య అవసరాల సిలిండర్ ధర 115 రూపాయలకు పెంచి ప్రజల మీద భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం అన్నమాట సంపూర్ణంగా అమలులోకి రాలేదని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో 769 పంచాయతీలు ఉండగా సగం పంచాయతీలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని, మరి ఆ గ్రామాల్లో ఉన్న మహిళలకు ఏ విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సు సౌకర్యం పెంచాలని నివాస ప్రాంతాలన్నిటికీ బస్సు ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్నీ నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున లక్షలాది ఇంటి స్థలాలు, పక్కా గృహాలు నిర్మిస్తామన్నమాట ఇంతవరకు అడుగు ముందుకు పడలేదని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో జగనన్న కాలనీల పేరుతో ఇచ్చిన లేఔట్లలో మౌలిక వసతులు లేకపోవడం, నిర్మాణ వ్యయం విపరీతంగా పెరగటంతో పేదలు ఇంటి నిర్మాణాలు చేపట్టలేకపోయారని ఫలితంగా అక్కడ కంపచెట్లు మొలుస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే పేదలకు ఇంటి స్థలాలు, పక్కా గృహాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధితో హామీలు అమలు చేయకపోగా, రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా మతం చుట్టూ, గుడి చుట్టూ లడ్డు చుట్టూ రాజకీయాల నడుపుతున్నారని, ఇది లౌకిక సాంప్రదాయాలతో కూడిన మన రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. మతతత్వ రాజకీయాలు కట్టిపెట్టి ఇచ్చిన వాగ్దానాల అమలుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు గంటెనపల్లి వెంకటేశ్వర్లు, ఎస్ ఎ .గౌస్ బాషా, జివిబి కుమార్ మాట్లాడారు.ఈ సమావేశంలో ఏ.పీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మిట్టనోసల.సుభాను, డి. మాలకొండ రాయుడు, పొందూరి.కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.