కందుకూరులో షాదీఖానా ఏర్పాటు చేసే బాధ్యతనాది
కూటమి ప్రభుత్వంలో ముస్లింల అభివృద్ధికి ప్రాధాన్యత – ఎమ్మెల్యే
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరు పట్టణంలోని పేదలకు త్వరలో ఇళ్లస్థలాలు అందిస్తామని, పేద ముస్లిం కుటుంబాలకు అందులో మొదటిప్రాధాన్యత ఉంటుందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా, పట్టణంలోని 150 మంది పేద ముస్లింలకు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా బుధవారం రంజాన్ తోఫా అందించారు. మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ సలాం సొంత ఖర్చుతో సరుకులు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ… ముస్లిం కుటుంబాలలో చాలామందికి సొంతగా ఇళ్లులేవని, కనీసం స్థలాలు లేని వారు చాలామంది ఉన్నారని నాగేశ్వరరావు అన్నారు. అలాంటి వారందరికీ త్వరలో తప్పక సహాయం అందుతుందని చెప్పారు. పట్టణంలో షాదీ ఖానా భవనాన్ని తప్పక నిర్మిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇమామ్, మౌజంలకు ముఖ్యమంత్రి చంద్రబాబు 90 కోట్లు విడుదల చేశారని, తాజాగా మరో 45 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ముస్లింల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు. డబ్బు ఎంతోమంది దగ్గర ఉన్నప్పటికీ… సేవ చేయాలన్న ఆలోచన, దానగుణం కొద్దిమందిలో మాత్రమే ఉంటుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. ప్రతిఒక్కరూ రంజాన్ పండుగ జరుపుకోవాలన్న మంచి ఆలోచనతో, పేదలకు తోఫా అందిస్తున్న సలాంను అల్లాహ్ చల్లగా చూడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లింలందరికీ ఆయన ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మత పెద్దలు రియాజ్ మౌలానా, ఫైరోజ్ మౌలానా, ముజీబ్ మౌలానా, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, ఏపీఈడబ్ల్యూఐడి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బెజవాడ ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి సలాం, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా, పార్టీ నేతలు జియావుద్దీన్, ఫిరోజ్, ఖలీల్, బాషా, వలీ, వడ్డేళ్ల రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.