తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఈనెల 15వ తేదీన ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని తెలిపారు. సంతమాగులూరు మండల కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గంలో ‘మీకోసం’ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో, తొలి కార్యక్రమాన్ని అద్దంకి నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం 15వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంతమాగులూరు ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతుంది.అదే రోజు సాయంత్రం సజ్జాపురంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, రాత్రి అక్కడే బస చేసి శనివారం ఉదయం గ్రామంలో పర్యటిస్తారని తెలిపారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయికి వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.