తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ స్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర సమగ్ర శిక్ష అకాడమిక్ మోనిటరింగ్ కోఆర్డినేటర్ శ్రీమతి కల్పనా శైల పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ విద్యార్థుల మెదడు అభివృద్ధిలో సుమారు 85 శాతం ఒకటి, రెండు తరగతుల దశలోనే జరుగుతుందని, అందువల్ల ప్రాథమిక తరగతుల విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థులలో భాషా, గణిత నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలల పట్ల బాధ్యతాయుత దృక్పథంతో వ్యవహరించి పాఠశాలలను ఆకర్షణీయంగా, ఆహ్లాదకరమైన అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న 36 రోజుల స్కూల్ రెడినెస్ కార్యక్రమానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు, మాడ్యూల్స్ ఇప్పటికే పాఠశాలలకు చేరాయని తెలిపారు. అదేవిధంగా బాల కిట్స్, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, జాదూ పిటారా కిట్స్, ఎఫ్‌ఎల్‌ఎన్ కిట్స్, టార్ల్ కిట్స్ వంటి వివిధ రకాల బోధన-అభ్యసన సామగ్రిని పాఠశాలలకు అందించామని చెప్పారు. డిజిటల్ కంటెంట్‌తో కూడిన 256 జీబీ పెన్‌డ్రైవ్‌లను కూడా అందించామని, వీటిని సమర్థవంతంగా వినియోగించి విద్యార్థులు కరికులం లక్ష్యాలు, సామర్థ్యాలు (Competencies) సాధించేలా కృషి చేయాలని సూచించారు.
జాయ్‌ఫుల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్యను అందించాలని, పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపరుచుకొని ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని ఆమె పేర్కొన్నారు. సమాజంలో ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మార్కాపురం ఉన్నత పాఠశాలను అక్కడి ప్రధానోపాధ్యాయుడు ఎంతో సుందరంగా అభివృద్ధి చేసిన విధానాన్ని ప్రశంసిస్తూ, జిల్లాలోని అన్ని పాఠశాలలు అదే తరహాలో అభివృద్ధి చెందాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో అన్ని వసతులు బాగా ఉన్నాయని మంచి భోజనం రుచికరంగా అందజేశారని అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ నాగేంద్ర నాయక్, ఎంఈఓలు సుబ్బారెడ్డి, శర్మ, కేఆర్పీలు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, డీఆర్పీలు పాల్గొన్నారు. సుమారు 280 మంది ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొని, శిక్షణలో పొందిన మెలకువలు తమ బోధనలో ఎంతో ఉపయోగపడతాయని, ఈ కార్యక్రమం తమకు విశేషమైన సంతృప్తిని కలిగించిందని తెలిపారు.
