తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
మహిళలపై నేరాల పట్ల సున్నా సహన విధానంతో ముందుకు సాగుతున్న మార్కాపురం జిల్లా పోలీసులు భార్యను హత్య చేసిన కేసులో నిందితుడైన భర్తను అరెస్టు చేసి కేసును వేగంగా ఛేదించారు.
కొమరోలు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం. 37/2026 U/s 85, 103(1), 118(1) BNS కేసుకు సంబంధించి, కొమరోలు మండలం సర్వేరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పందీటి మరియ జ్యోతి (32)ను ఆమె భర్త పందీటి దావీదు (40) పాత కుటుంబ విభేదాలు, అనుమానాల నేపథ్యంలో దారుణంగా హత్య చేసిన ఘటనలో పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు.విచారణలో నిందితుడు మద్యం సేవిస్తూ భార్యను తరచూ వేధించేవాడని, ఆమెపై అనుమానం పెంచుకొని ముందస్తు ప్రణాళికతో హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. తేది 10.06.2026 ఉదయం సర్వేరెడ్డిపల్లి గ్రామంలో బాధితురాలు బయటకు వెళ్లిన సమయంలో నిందితుడు గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు గారి పర్యవేక్షణలో, గిద్దలూరు రూరల్ సీఐ జే. రామకోటయ్య, కొమరోలు ఎస్సై జె. నాగరాజు మరియు వారి సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక దర్యాప్తు ద్వారా నిందితుడిని గుర్తించి, తాటిచెర్ల మోటు జంక్షన్ సమీపంలో అరెస్టు చేశారు.హత్య జరిగిన 48 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.