విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారని, అదే స్ఫూర్తితో భారత ప్రధానమంత్రి భోగాపురం పర్యటనతో పాటు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సేవలు, భద్రత తదితర అంశాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్షకు ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఈ ప్రాంత అభివృద్ధి చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పేర్కొన్నారు. ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగనున్న ఈ మహా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.కార్యక్రమానికి స్వచ్ఛందంగా హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజల రాకపోకలు, తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, భద్రత తదితర అంశాల్లో పకడ్బందీ ఏర్పాట్లు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళిక రూపొందించాలని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సుల రాకపోకలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అన్ని బస్సులు ఉదయం 9 గంటలకల్లా భోగాపురం చేరుకునేలా, ఆయా ప్రాంతాల దూరం మరియు రహదారి పరిస్థితులను బట్టి ఉదయం 6 గంటల నుంచే దశలవారీగా బయలుదేరేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. గ్రామం, మండలం, రూట్‌ వారీగా బాధ్యతలను స్పష్టంగా కేటాయించి అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.బస్సుల రూట్ మ్యాప్‌, సమయాలు, ప్రయాణ వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల సాధారణ రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉపాధి, పెట్టుబడులు, పర్యాటకం, వ్యాపారం, విమానయాన రంగాల్లో విస్తృత అవకాశాలు లభించనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ అవకాశాలపై యువతకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, కార్పొరేషన్ చైర్మన్లు సీతంరాజు సుధాకర్, గండి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *