100 జతలతో ఒంగోలు జాతి గిత్తల ఘన ప్రదర్శన – జనసంద్రంగా మారిన ప్రకాశం సీమ!
ఎద్దుల బండ్లపై ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, ప్రజాప్రతినిధులు మరియు అధికారుల ఊరేగింపు:
ప్రకాశం సీమలో పౌరుష నాదం.. కన్నులపండువగా ‘ఒంగోలు గిత్తల’ మహోత్సవం!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 వసంతాలు పూర్తయిన చారిత్రాత్మక శుభసందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘ఒంగోలు ఉత్సవం’ నగరంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పండుగ వాతావరణాన్ని నింపింది. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఒంగోలు వీధుల్లో కన్నులపండువగా సాగిన ‘ఒంగోలు గిత్తల భారీ ర్యాలీ’ పౌరుషానికి, తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టింది. నగరంలోని మినీ స్టేడియం వద్ద ఘనంగా ప్రారంభమైన ఈ శోభాయాత్ర అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు అత్యంత వైభవంగా సాగింది. ఒంగోలు నగర చరిత్రలోనే కాకుండా ప్రకాశం జిల్లా సాంస్కృతిక చరిత్రలోనే ఇది ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయేలా వేడుకలు జరిగాయి.తెలుగు నేల గర్వించదగ్గ ఒంగోలు జాతి విశిష్టతను చాటిచెబుతూ ఏకంగా 100 జతల ఎద్దులు ఈ ర్యాలీలో ఊరేగాయి. కాడికి కట్టిన ఒంగోలు గిత్తల కట్టుదిట్టమైన శారీరక సౌందర్యం, మెడలో మెరిసే గజ్జెల రవళులు, శబ్దించే గంటల నాదాలు నగర ప్రజలను ఎంతగానో పులకింపజేశాయి. మినీ స్టేడియం నుంచి అద్దంకి బస్టాండ్ వరకు దారి పొడవునా విద్యుత్ కాంతుల వెలుగులు, రంగురంగుల తోరణాలు, పూల అలంకరణలతో ఒంగోలు నగరం అంగరంగ వైభవంగా మారి అచ్చమైన పల్లెటూరి పండగ శోభను సంతరించుకుంది. గిత్తల రాజసాన్ని, వాటి నడకలోని అందాలను చూసిన జనం ఆనందంతో మురిసిపోయారు. మన ప్రసిద్ధ ఒంగోలు గిత్తల సౌందర్యాన్ని చూసేందుకు ఒంగోలు నగరవాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది ప్రజలతో వీధులన్నీ జనసంద్రంగా మారాయి. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ, చప్పట్లు, హర్షధ్వానాలతో ప్రజలు ఈ ఘట్టాన్ని తిలకించారు. మున్సిపాలిటీ 150 ఏళ్ల పండుగ వేళ సాగిన ఈ చారిత్రాత్మక ఎద్దుల ఊరేగింపు ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరగని మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది.ప్రదర్శనలో విశేషంగా ఆకట్టుకుని విజేతలుగా నిలిచిన గిత్తల యజమానులు, 1.లింగారెడ్డి .శ్రీకాంత్ రెడ్డి(50,000) 2.రాయపాటి.విశ్వేశ్వర రావు(40,000)
లకు నగదు పురస్కారాలు (ప్రైజ్ మనీ) మరియు ప్రత్యేక బహుమతులను అందించి అభినందించారు. మన ప్రాంతీయ సాంప్రదాయాన్ని, పశు సంపదను కాపాడుకుంటూ వస్తున్న రైతు సోదరులను, గిత్తల యజమానులను ఈ సందర్భంగా కొనియాడారు.ఈ అపూర్వ ఘట్టంలో ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు,పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఒంగోలు జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, కనిగిరి ఎమ్మెల్యే శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే శ్రీ ఎం.ఎం. కొండయ్య యాదవ్ ,శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి,తదితర ప్రముఖులు ఎద్దుల బండ్లపై ప్రయాణించి ఉత్సవ శోభను ద్విగుణీకృతం చేశారు.
