ఆపదలో ఉన్న తోటి మనిషిని ఆదుకోవడానికి స్వచ్ఛందంగా చేసే రక్తదానమే నిజమైన మానవత్వానికి ప్రతీక అని కలాం ట్రస్ట్ (కావలి) అధ్యక్షుడు పేరూరి వెంకట సాయితేజ అన్నారు. స్థానిక రెడ్ క్రాస్ రక్తకేంద్రంలో కలాం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 55 మంది యువతీయువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా సాయితేజ మాట్లాడుతూ.. గత పది రోజులుగా సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభించిందని, పట్టణ యువత, కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద బాధితులు, ప్రసవ సమయాల్లో బాలింతలు, దీర్ఘకాలికవ్యాధిగ్రస్తులు, తలసేమియాతో బాధపడే చిన్నారుల ప్రాణాలు కాపాడేందుకు రక్తం అత్యంత ఆవశ్యకమని గుర్తుచేశారు.అత్యవసర సమయాల్లో రక్తం అందక ఏ ఒక్క ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో రక్తనిల్వలు సమృద్ధిగా ఉండేలా చూడాల్సిన బాధ్యత సమాజంపై, ప్రధానంగా యువతపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కావలి రెడ్ క్రాస్ చైర్మన్ డి. రవిప్రకాష్, వైస్ చైర్మన్ కె. హరినారాయణ రెడ్డి, కార్యదర్శి బి.ఎస్. ప్రసాద్ రక్తదాతలను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. రెడ్ క్రాస్ సిబ్బంది రక్త సేకరణలో సహకరించారు.
శిబిరం విజయవంతానికి విశేష కృషి చేసిన సమన్వయకర్తలు సుధీర్, ఆకాష్ వర్మలతో పాటు వాలంటీర్లకు ట్రస్ట్ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలాం ట్రస్ట్ సభ్యులు ఓ. మనోహర్, షేక్ షరీఫ్, షేక్ అయేషా, బి. అనిల్ కుమార్, కె. లోకేష్, షేక్ ఏలీయాజ్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *