రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ గారు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల పరిస్థితులు, శాంతిభద్రతల అంశాలపై పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.సమస్యాత్మక గ్రామాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక నిఘా మరియు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.సమస్యాత్మక గ్రామాల్లో పల్లె నిద్రలు నిర్వహించి, గ్రామస్థులతో మమేకమై స్థానిక సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. బీట్ కానిస్టేబుళ్లు తరచుగా గ్రామాలను సందర్శిస్తూ పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.గ్రామాల్లో పాత వివాదాలు, భూ తగాదాలు, కుటుంబ కలహాలు తదితర సమస్యలను ముందుగానే గుర్తించి, అవి శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాత నేరస్తులు, చెడు నడతగల వ్యక్తులు(రౌడీ షీటర్స్) అలవాటు నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని మరియు బైండ్ ఓవర్ చేయాలని, పోలింగ్ స్టేషన్లు, లొకేషన్లు, వార్డులను క్షేత్రస్థాయిలో సందర్శించి, సమగ్ర సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అతి సమస్యాత్మక ప్రాంతాలలో వ్యక్తులు, గత వివాదాలపై పూర్తి సమాచారం కలిగి ఉండి, ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *