తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-

అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, ఎల్సెవియర్ సంస్థ సంయుక్తంగా ప్రకటించే ప్రపంచ అత్యుత్తమ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో గుడ్లూరుకు చెందిన డాక్టర్ సుబ్బరామ కౌశిక్ సూరపరాజు వరుసగా మూడో ఏడాది స్థానం దక్కించుకున్నారు. ఆయన గుడ్లూరుకు చెందిన సూరపరాజు నాగేంద్ర ప్రసాదరావు, పద్మావతి దేవి దంపతుల కుమారుడు. ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న కారుణ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ (రీసెర్చ్)గా పనిచేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల పరిశోధన పత్రాలు, వాటికి లభించిన సైటేషన్ల ఆధారంగా ఈ జాబితాను ఏటా రూపొందిస్తారు. డాక్టర్ కౌశిక్ సౌర ఉష్ణ శక్తి వ్యవస్థలు, ఉష్ణ శక్తి నిల్వ, ఫేజ్ చేంజ్ మెటీరియల్స్, బ్యాటరీ థర్మల్ మేనేజ్‌మెంట్ రంగాల్లో పరిశోధనలు చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వరుసగా మూడోసారి ఈ గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు, సతీమణి వెంకట నాగ కామాక్షి జాహ్నవి, గురువులు, సహ పరిశోధకులు, కారుణ్య యాజమాన్యం అందించిన ప్రోత్సాహమే దీనికి కారణం. శక్తి, నీటి రంగాల్లో సమాజానికి ఉపయోగపడే పరిశోధనలను కొనసాగిస్తాను” అని తెలిపారు. ఈ ఘనత సాధించిన ఆయనను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, మిత్రులు అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *