కౌశిక్ మృతి వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలి — పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చోటుచేసుకున్న కౌశిక్ మృతి కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారిని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కౌశిక్ మృతి కేసు దర్యాప్తు, తదుపరి చర్యలపై ఎస్పీతో ప్రతినిధి బృందం చర్చించింది. హైకోర్టు ఆదేశాల మేరకు చార్జిషీటు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపడతామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు ప్రతినిధి బృందం వెల్లడించింది.కౌశిక్ తల్లి మౌలాబి తన కుమారుడిని కొట్టి చంపారని ఆరోపించినప్పటికీ, పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగరాయకొండ నవోదయ చైతన్య కోచింగ్ సెంటర్ యజమానికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ ఆరోపణలతో పాటు కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.కేసు దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందనే అంశంపై కూడా ప్రతినిధి బృందం ఎస్పీని ప్రశ్నించింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కేసు దర్యాప్తు, తదుపరి చర్యల్లో కొంత జాప్యం జరుగుతున్నట్లు ఎస్పీ ప్రతినిధి బృందానికి తెలిపారని వారు వెల్లడించారు.రెండు మూడు రోజుల్లో దర్యాప్తు అధికారిగా ఉన్న ఏఎస్పీని కలిసి, తౌశిక్ది హత్యేనని తమ వాదనకు మద్దతుగా నిలిచే మరిన్ని ఆధారాలను అందజేస్తామని పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.కౌశిక్, ఆయన తల్లి మౌలాబి మృతులకు సంబంధించి పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చిత్తశుద్ధితో వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు.