తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ట్రాన్స్ జెండర్ బోను దుర్గ అభ్యర్థి బరిలోకి దిగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఆదివారం ఉదయం ఒంగోలు నెల్లూరు బస్టాండ్ సమీపంలోని డి.ఆర్.ఆర్.ఎం మున్సిపల్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆమె తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ… “ఇప్పటివరకు కార్పొరేషన్ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్లకు అవకాశం రాలేదని,మాలాంటి వారి సమస్యలు, బాధలు ఎవరికీ తెలియవు. నగరంలో అభివృద్ధి అందరికీ సమానంగా జరగాలి. నాకు అవకాశం ఇస్తే నా 11వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాను” అని ఆమె తెలిపారు.ఒంగోలు కార్పొరేషన్ చరిత్రలో ట్రాన్స్ జెండర్ ఒకరు నామినేషన్ వేయడం ఇదే తొలిసారి కావడంతో, ఎన్నికల అధికారులు, ఇతర అభ్యర్థులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. సమానత్వానికి, ప్రజాస్వామ్యానికి ఇది ఒక మంచి పరిణామమని పలువురు సామాజికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈసారి ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 62 డివిజన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ ట్రాన్స్ జెండర్ అభ్యర్థి బోన దుర్గ మంచి ఫలితాన్ని ఇస్తుందోనని స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.