నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లాలో అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్., గారు, జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గార్లు మంగళవారం ఒంగోలు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి, కార్యాలయాన్ని, ప్రాంగణాన్ని నిశితంగా పరిశీలించారు.అనంతరం జిల్లా ఎస్పీ గారు దర్శి సబ్ డివిజన్ పరిధిలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పర్యటించి, ఆయా మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను, అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు భద్రత, బందోబస్తు విధుల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. తొలుత ముండ్లమూరు మండలమును సందర్శించి, అక్కడ చేపట్టాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తాళ్లూరు మండలంలో పర్యటించి, నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, నామినేషన్లు దాఖలు చేసే జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల వాహనాల కోసం తగిన పార్కింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీలన్నీ పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీగారు విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా తాళ్ళూరు ఎన్నికల నామినేషన్ వేసే కేంద్రానికి వచ్చిన తాళ్ళూరు ప్రజలతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికల గతంలో ఎలాంటి వాతావరణంలో జరిగేవని వారిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాజకీయ నాయకులతో పాటు ప్రజల సహకారం కూడా చాలా అవసరం ఉందన్నారు. ప్రజలు, పోలీసులు సహాయసహకారాలతో పని చేస్తే… ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగటానికి అవకాశం ఉండదన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని ముండ్లమూరు, తాళ్లూరు ఎస్ఐలను ఆదేశించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించేలా చూడాలని, విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.జిల్లా ఎస్పీ గారి వెంట ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ముండ్లమూరు ఎస్ఐ కోటేశ్వరరావు, తాళ్లూరు ఎస్ఐ మల్లికార్జునరావు, రెవెన్యూ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.