మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా తమకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు–కర్నూలు ప్రధాన రహదారిపై బైఠాయించారు.వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సమూహంగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, లేనిపక్షంలో అభ్యర్థులు నామినేషన్ వేసి తిరిగి వచ్చే వరకు పోలీసులు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద తమకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని వారు కోరారు.ఈ సందర్భంగా అన్నా రాంబాబు స్వయంగా ఒంగోలు–కర్నూలు రహదారిపై బైఠాయించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రధాన రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నామినేషన్ కేంద్రం వద్ద అనుమతులు ఉంటాయని, నిబంధనలకు విరుద్ధంగా సమూహంగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది. నిబంధనల మేరకు సహకరించాలని పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులను కోరారు.అయితే తమ అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసే వరకు భద్రత కల్పించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టుబట్టారు. ఈ విషయంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ వెంటనే సమస్య పరిష్కారం కాకపోవడంతో ఉద్రిక్తత కొనసాగింది.దాదాపు గంటకు పైగా అన్నా రాంబాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో పొదిలిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరోవైపు ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *