తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని చాటుతూ, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ విద్యార్థుల సౌకర్యార్థం పూర్వ విద్యార్థినులు పది వేల రూపాయలు విలువైన వాటర్ డిస్పెన్సర్‌ను బహూకరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య తో కావలి జవహర్ భారతి కళాశాలలో సహాధ్యాయినులుగా చదువుకున్న శ్రీలక్ష్మి, శైలజ, హిమజలు ఈ సేవా కార్యక్రమానికి ముందుకొచ్చారు.
పాఠశాలలో చదువుకునే చిన్నారులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వారు చేసిన ఈ దాతృత్వం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి మెగా పీటీఎం స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యం
ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు, స్థానిక ప్రజల్లో బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం) కార్యక్రమాల స్ఫూర్తితో ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాలు, అభ్యసన వాతావరణం మెరుగుపడేందుకు దోహదపడుతుంది.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు, పూర్వ విద్యార్థులు, దాతలు సమన్వయంతో పనిచేస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని ఈ కార్యక్రమం స్ఫూర్తినిస్తోంది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య, డాక్టర్ అర్రిబోయిన రాంబాబు, మసనం మలీరావు, పాఠశాల చైర్మన్ అల్లడి మంజుల, వైస్ చైర్మన్ మంచు శాంతి, ఎస్ఎంసీ సభ్యురాలు సునీత తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి మనందరి బాధ్యత. ప్రజల చేయూతతో ప్రతి పాఠశాల మరింత మెరుగైన విద్యా కేంద్రంగా రూపుదిద్దుకోవాలనే సందేశాన్ని ఈ వాటర్ డిస్పెన్సర్ బహూకరణ కార్యక్రమం అందించింది.