శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ, ద్విచక్ర వాహనదారుల ప్రాణ రక్షణ మరియు రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా భారీ ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ప్రధాన కూడళ్లు, జాతీయ మరియు రాష్ట్ర రహదారులు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను గుర్తించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం ఎంత తీవ్రంగా ఉంటుందో వివరించి, ప్రతి ప్రయాణంలో హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు ప్రధాన కారణాల్లో హెల్మెట్ వినియోగం లేకపోవడం ఒకటని తెలిపారు. హెల్మెట్ ధరించడం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల పట్ల బాధ్యత కూడా అని పేర్కొన్నారు. వాహనదారులు ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన నాణ్యమైన హెల్మెట్లను ధరించి, స్ట్రాప్‌ను సరిగా బిగించుకోవాలని సూచించారు.అలాగే అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు.ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, “హెల్మెట్ మీ ప్రాణాలకు రక్ష – ప్రతి ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరి” అనే సందేశాన్ని ప్రజలకు అందించారు.