తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
వర్జీనియ పొగాకు గిట్టుబాటు ధరలకై, రైతు సంరక్షణ కోసం ఈనెల 19న శుక్రవారం ఒంగోలులో జరిగే భారీ ట్రాక్టర్ ర్యాలీలో వేలాది సంఖ్యలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని పొగాకు 27 వ వేలం కేంద్రం వద్ద గురువారం రైతులతో ఆయన మాట్లాడుతూ పొగాకు కంపెనీలు సిండికేట్ గా ఏర్పడి గత ఏడాది కన్నా పొగాకును అతి తక్కువ ధరలకు కొనుగోళ్ళను ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటా రూ.16 వేలకు కొనుగోలు చేస్తూ పొగాకు రైతులను నిలువునా దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు నిలువునా అప్పుల్లో మునిగిపోయి, రైతుల బ్రతుకే ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి నెలకొంటుంది అన్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని రూ. వెయ్యి కోట్లు నిధులు కేటాయించి ఎస్ టి సి, పొగాకు బోర్డు, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించి పొగాకు రైతులను పొగాకు కొనుగోలు కంపెనీల బారి నుండి రక్షించాలని కోరారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే కలుగజేసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పొగాకు గిట్టుబాటు ధర కింటా 23 వేల రూపాయలకు తగ్గకుండా దక్కేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నియోజక వర్గంలో పలు గ్రామాల రైతులు పొగాకు తీసుకురాగా ధరలు దారుణంగా వేయటంతో రైతులు ఆగ్రహించి వేలాన్ని నిలిపేయడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపించే విధంగా ఈ నెల 19వ తేదీన ఒంగోలులో జరిగే ట్రాక్టర్ ర్యాలీలో రైతులు రైతు శ్రేయోభిలాషులు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈకార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై ఆనందమోహన్ తదితరులు పాల్గొన్నారు.