google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఏ.పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి రాష్ట్ర సమితి పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలపై జూన్ 20 నుంచి దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా జూన్ 24న బుధవారం ఒంగోలులోని జిల్లా కలెక్టర్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి యర్రంశెట్టి ఆనందమోహన్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల మస్టర్ పాయింట్ వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు రావలసిన న్యాయమైన డిమాండ్ల కోసం ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేస్తున్న పోరాటానికి కార్మికులు నలుమూలల నుండి తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ఏఐటియుసి రాష్ట్ర మహాసభలలో కనీస వేతనం 36వేల రూపాయలు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగిందని, దానిని అమలు చేయాలని కోరుతూ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, కనీస వసతులు సైతం వారికి కల్పించకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని తదితర న్యాయమైన డిమాండ్ల సాధనకై చేస్తున్న పోరాటాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జూన్ 20న మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు, జూన్ 22న స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, జూన్ 24న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు, జులై 7న చలో విజయవాడ కార్యక్రమాలకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి పిలుపునివ్వడం జరిగిందని ఆయన తెలిపారు. అందులో భాగంగా జులై 24న ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు కాకుమాని రవణమ్మ, పులి నాగేశ్వరరావు, కత్తి విజయ్, మెండా మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *