తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం : –
పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా .శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా టంగుటూరు మండలం, తూర్పు నాయుడుపాలెం గ్రామంలోని స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని మంత్రి గారు సందర్శించి, అక్కడ ఉన్న ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు ఆయన స్వయంగా నోట పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి మాట్లాడుతూ…. జిల్లాలో 1,56,477, మంది 0-5 సంవత్సరాల చిన్నారులు ఉన్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. పల్స్ పోలియో ప్రజా ఉద్యమం కావాలని ఆయన అన్నారు. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా నిలబెట్టడంలో పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలక పాత్ర పోషించిందన్నారు. భవిష్యత్తు తరాలకు వైకల్యం లేని ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క చైల్డ్ మిస్ అవ్వకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలియో చుక్కల ప్రాధాన్యతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఒకవేళ ఈరోజు రాలేకపోయిన వారికి, రాబోయే రెండు రోజుల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖాధికారి టి.వెంకటేశ్వర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది మరియు గ్రామ ప్రముఖులు, వైద్యాధికారులు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.