తొలి శుభోదయం న్యూస్ కొండపి :-
పొగాకు రైతులకు పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం కొండపి పొగాకు వేలం కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి, రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వేలం కేంద్రంలో జరుగుతున్న పొగాకు కొనుగోలు ప్రక్రియను, రైతులకు అందుతున్న ధరలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉందని, వేలం ప్రక్రియలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎండనక, వాననక కష్టపడి పంట పండించే రైతన్నలు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులకు కచ్చితంగా లాభసాటి ధర లభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. వేలం కేంద్రంలో ఏ ఒక్క రోజూ కూడా ‘నో బిడ్’ (వ్యాపారులు కొనుగోలు చేయకుండా నిలిపివేయడం) అనే పరిస్థితి రాకుండా పొగాకు బోర్డు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిరంతరం నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు. పొగాకు వ్యాపారులు, కంపెనీల ప్రతినిధులు ఉత్సాహంగా వేలంలో పాల్గొని, నాణ్యతకు తగ్గట్టుగా పోటీపడి మంచి ధరలు పలకడం ద్వారా రైతులకు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతులకు ఎలాంటి సాంకేతిక లేదా రవాణా ఇబ్బందులు కలగకుండా వేలం కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.