ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి – రాష్ట్రాలకే వైద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించాలి
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
నీట్ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని ఖండిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్ సంయుక్త పిలుపు మేరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. బంద్‌కు సీఐటీయూ, కేవీపీఎస్, ఐద్వా తదితర ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.ప్రభుత్వం బంద్ కు ఆటంకాలు పెట్టినా విద్యార్థులు చైతన్యంతో బంద్ ను జయప్రదం చేశారు.నీట్ పరీక్షల్లో పదేపదే చోటుచేసుకుంటున్న అవకతవకలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని, ఈ అంశంపై ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్య హక్కులపై దాడేనని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. కేంద్ర స్థాయిలో నీట్ నిర్వహణకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వాలే తమ వైద్య విద్య ప్రవేశ పరీక్షలను నిర్వహించే అధికారాన్ని కల్పించాలని డిమాండ్ చేశాయి.బంద్‌కు ముందు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు నోటీసులు అందజేసి యాజమాన్యాలతో చర్చలు నిర్వహించారు. ఒంగోలు, కందుకూరు ప్రాంతాల్లో ముందురోజు ర్యాలీలు నిర్వహించి విస్తృత ప్రచారం చేపట్టారు. ఫలితంగా ఒంగోలు, కందుకూరు, అద్దంకి, చీమకుర్తి, సింగరాయకొండ, దర్శి, ఉలవపాడు, కొండపి, కొత్తపట్నం ప్రాంతాల్లో బంద్ విజయవంతమైంది. కొండపి, కొత్తపట్నం ప్రాంతాల్లో విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.ఒంగోలులో ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్‌లు నిర్వహించగా, సీఐటీయూ, కేవీపీఎస్, ఐద్వా తదితర ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామి, రాకేష్, కిరణ్,నితీష్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్. రాజశేఖర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి. రఘురాం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, రాజ్యలక్ష్మి గారు పాల్గొన్నారు.కందుకూరులో మహిళా సంఘం నాయకురాలు సుల్తానా, సీఐటీయూ నాయకులు గౌస్, సామాజికవేత్త బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అద్దంకిలో సీహెచ్. వినోద్, తగిరాల వెంకటేశ్వర్లు, వి. బాలకోటయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది, గవర్నమెంట్ జూనియర్ కాలేజీల వద్ద గేట్ మీటింగులు నిర్వహించారు.చీమకుర్తిలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జి. దేవరాజు అన్ని విద్యాసంస్థలను సందర్శించి బందు విజయవంతం అయ్యేందుకు కృషి చేశారు.సింగరాయకొండలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దేవా ,ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన తెలిపి ఎంఈఓలకు వినతిపత్రాలు అందజేశారు.
దర్శిలో dyfi కె.వి. పిచ్చయ్య, ఏఐవైఎఫ్ నాయకులు బంద్ నిర్వహించగా,
దొనకొండ citu నాయకులు ch అంజయ్య ఆధ్వర్యంలో బంద్ జయప్రదం చేయడం జరిగింది.
ఉలవపాడులో సీఐటీయూ కార్యదర్శి కుమార్ నాయకత్వంలో బంద్ విజయవంతమైంది.
