తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
సమాజంలో దివ్యాంగులు, వయోవృద్ధులు స్వతంత్రంగా ఎవరిపై ఆధారపడకుండా జీవించేలా చూడటంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వారికి సులభతరమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో రూ. 43 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ ని జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు, ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన రావు, బి.ఎన్. విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ భవనానికి రోజువారీ పనుల నిమిత్తం, విజ్ఞాపన పత్రాలు సమర్పించేందుకు వచ్చే దివ్యాంగులు, వయోవృద్ధులు పై అంతస్తులకు వెళ్లే క్రమంలో పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు ఈ లిఫ్ట్ సౌకర్యాన్ని సమకూర్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన ‘SIPDA’ (Scheme for Implementation of the Rights of Persons with Disabilities Act, 2016) పథకం కింద జిల్లా యంత్రాంగం ఈ చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధుల చొరవతో పాటు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ఆద్వర్యంలో యంత్రాంగం వేగంగా ముందడుగు వేసిందని తెలిపారు. ఈ లిఫ్ట్ నిర్మాణం మరియు ఏర్పాటు బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSIDC), ఒంగోలు వారు పూర్తి చేశారన్నారు. మొత్తం రూ. 43.00 లక్షల అంచనా వ్యయంతో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ ద్వారా మొదటి విడతగా రూ. 23.50 లక్షల నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందన్నారు. ఒకేసారి 13 మంది ప్రయాణించేలా రూపొందించిన ఈ లిఫ్ట్ వద్దకు చక్రాల కుర్చీల (Wheelchair) లో వచ్చే వారు నేరుగా చేరుకునేలా ప్రత్యేకంగా ర్యాంప్ (Ramp) సౌకర్యాన్ని కూడా సమకూర్చారనీ మంత్రి తెలిపారు. ఇదే సమయంలో జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ..ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గుర్తించిన సుమారు 28,500 మంది దివ్యాంగులలో అత్యవసర సహాయం అవసరమైన 15,000 మందికి విడతల వారీగా నాణ్యమైన సహాయ పరికరాలను (Assistive Devices) పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు మరియు వయోవృద్ధుల హక్కులను పరిరక్షించడంలోనూ, వారికి అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత కల్పించడంలోనూ కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందని మంత్రి తెలియజేశారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. బాపట్ల లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి వినికిడి లోపం ఉన్న వారికోసం AI తో కూడిన ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టినట్లు మంత్రి వెల్లడించారు.దివ్యాంగులకి 6 వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15 వేలు పెన్షన్ అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
