తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్య పై గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. వర్షాభావ ప్రభావంతో ఏర్పడిన నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు పట్టణ కమిషనర్‌తో పాటు స్థానిక నాయకులతో ఆయన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో పట్టణంలోని వార్డుల వారీగా ఉన్న తాగునీటి సమస్యలను, చెడిపోయిన బోర్లు మరియు నీరు అడుగంటిపోయిన బోర్ల వివరాలను క్షుణ్ణంగా సమీక్షించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తక్షణమే తాగునీటిని ఏ విధంగా సరఫరా చేయాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. స్థానిక నాయకత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజా సమస్యలను పర్యవేక్షించాలని, తాగునీటి సమస్య వచ్చిన వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పట్టణ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వార్డుల వారీగా పర్యటిస్తానని వెల్లడించారు. నాయకులందరూ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు..