బారికేడ్లను దాటుకుని కలెక్టరేట్ వద్దకు చేరుకున్న ప్రజా సంఘాల నాయకులు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ పాఠశాల విద్యార్థి తౌషిక్, అతని తల్లి మౌలాబీ మరణాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎమ్మార్పీఎస్, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ఆందోళన చేపట్టారు.ఈ కార్యక్రమం నేపథ్యంలో ఒంగోలులో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనకారులు కలెక్టరేట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పోలీసులు ఏర్పాటు చేసిన భారీ బారికేడ్లను దాటుకుని ఆందోళనకారులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. తౌషిక్, మౌలాబీ మరణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
