తొలి శుభోదయం సింగరాయకొండ :-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలలో భాగంగా, డివిజన్ స్థాయిలో ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో సింగరాయకొండ మండల ఉపాధ్యాయుల క్రికెట్ జట్టు ఘన విజయాన్ని సాధించి విజేతలుగా నిలిచింది. ఈ జట్టు మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోటీల్లో పాల్గొని అద్భుత ప్రదర్శన కనబరిచింది.ఈ పోటీల్లో డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయ జట్లు ఉత్సాహంగా పాల్గొనగా, సింగరాయకొండ ఉపాధ్యాయులు క్రమశిక్షణ, జట్టు ఐక్యత, ఆటతీరు పరంగా మిగతా జట్లకంటే ముందుండి తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ సమన్వయంతో ఆడుతూ ప్రత్యర్థులను ఎదుర్కొని విజయం వైపు దూసుకెళ్లారు.ఫైనల్ మ్యాచ్‌లో ఒంగోలు జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోటీలో సింగరాయకొండ ఉపాధ్యాయుల జట్టు సమైక్య ప్రదర్శనతో స్పష్టమైన ఆధిక్యత సాధించి గెలుపొందడం విశేషంగా నిలిచింది. ఈ విజయంతో సింగరాయకొండ మండలానికి డివిజన్ స్థాయిలో మంచి గుర్తింపు లభించిందని పలువురు అభిప్రాయపడ్డారు.విజేతలైన జట్టు సభ్యులను విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సహ ఉపాధ్యాయులు హర్షాతిరేకాలతో అభినందించారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు మాట్లాడుతూ, తమ విజయానికి సహకరించిన మండల విద్యాశాఖ అధికారులు, సహచర ఉపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రీడా పోటీల్లో సింగరాయకొండ మండలానికి మరిన్ని విజయాలు తీసుకువస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *