తల్లికి వందనం పథకం వర్తించేలా కృషి చేస్తా
చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందాలి
అంగన్వాడి సిబ్బందికి సూచించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు
తొలి శుభోదయం కందుకూరు:-
అంగన్వాడి టీచర్లు మరియు వర్కర్లకు ప్రభుత్వం అందిస్తున్న అధునాతన 5G ఫోన్లను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం పంపిణీ చేశారు. కందుకూరు ప్రాజెక్ట్ పరిధిలో 154 మంది, ఉలవపాడు ప్రాజెక్టు పరిధిలో 184 మందికి ఫోన్లు స్వయంగా అందించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలకు పౌష్టిక ఆహారం సక్రమంగా అందేలా అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బందికి కూడా తల్లికి వందనం పథకం అమలు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారని అన్నారు. అంగన్వాడి టీచర్లకు గ్రాట్యుటీని 20వేల నుంచి లక్ష రూపాయలకు, వర్కర్లకు 20వేల నుంచి 40 వేలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. అంగన్వాడి కేంద్రాలకు వచ్చే సరుకులు, స్టాకు, ఖర్చులు, అటెండెన్స్ వివరాలన్నీ ఇకనుంచి ఫోన్లలోనే నమోదు చేయాల్సి ఉంటుందని సిబ్బందికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు. ఈ సందర్భంగా తమకు ఇస్తున్న 11,500 రూపాయల జీతం సరిపోవడంలేదని, జీతం పెంపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని వర్కర్లు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సిడిపిఓ ఉషారాణి, ఉలవపాడు మండల సిడిపిఓ మాధవి లత, అంగన్వాడి సూపర్వైజర్లు, టీచర్లు పాల్గొన్నారు.
