తొలి శుభోదయం మార్కాపురం:-

మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవాలయాన్ని శనివారం జిల్లా ఎస్పీ గారు సందర్శించారు. మహోత్సవాల్లో భాగంగా రథసప్తమి సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దేవాలయ పరిసరాలు, ప్రవేశ మార్గాలు, రథం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, బందోబస్తు మరియు ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను సమీక్షించారు. పోలీస్ అధికారులతో పాటు ఆలయ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవానికి ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో సుమారు 350 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదనంగా ప్రత్యేక రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో పోలీసులు, ఫైర్ ఇంజన్, అంబులెన్స్ సిబ్బంది ఉంటారని తెలిపారు.ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని, బయటి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు కల్పించామని చెప్పారు. భక్తులు పోలీస్ వారికి సహకరించి, వారి సూచనలను పాటించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.అనంతరం రథసప్తమి సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ గారు పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రథోత్సవం సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే నేపథ్యంలో దేవాలయ పరిసరాలు, రథం వద్ద, ప్రధాన రహదారులు మరియు ప్రవేశ–నిష్క్రమణ మార్గాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని, బయటి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అదనంగా ప్రత్యేక రెస్పాన్స్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది విధుల్లో అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, మార్కాపురం సీఐ సుబ్బారావు, వైపాలెం సీఐ అజయ్ కుమార్, కనిగిరి సీఐ శ్రీనివాసులు, కంభం సీఐ మల్లికార్జునరావు, గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్, త్రిపురాంతకం సీఐ అస్సాం, ఆర్‌ఐ సీతారామిరెడ్డి, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *