తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :-
మహిళలు మరియు విద్యార్థినుల ఆత్మరక్షణే పరమావధిగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం సమన్వయంతో జిల్లావ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సమాజంలో మహిళల భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో, సాంకేతికతను సామాన్యులకు చేరువ చేస్తూ ‘శక్తి యాప్’ (Shakthi App) డౌన్లోడ్ ప్రక్రియను ఒక ఉద్యమంలా చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు రద్దీ ప్రాంతాలు, విద్యా సంస్థలు మరియు కార్యాలయాలను సందర్శించి, మహిళలకు ఈ యాప్ యొక్క విశిష్టతను క్షుణ్ణంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను కేవలం షేక్ (Shake) చేయడం ద్వారా లేదా SOS బటన్‌ను నొక్కడం ద్వారా క్షణాల్లో పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం మరియు బాధితుల ఖచ్చితమైన లొకేషన్ ఎలా చేరుతుందో ప్రత్యక్ష ప్రదర్శన (Live Demo) ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.కేవలం యాప్‌పై అవగాహన కల్పించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో మహిళల మొబైల్ ఫోన్లలో యాప్‌ను ఇన్స్టాల్ చేయించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. “శక్తి యాప్ అనేది ప్రతి మహిళా తన మొబైల్లో ఉంచుకోవాల్సిన అత్యవసర రక్షణ కవచం. ఆపద ఎదురైనప్పుడు భయం వీడి, ఈ డిజిటల్ సాధనాన్ని వినియోగించి పోలీసుల సహాయం పొందాలి” అని పిలుపునిచ్చారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ అహర్నిశలు కట్టుబడి ఉందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు పోలీసుల మధ్య ఉన్న దూరం తగ్గి, మరింత సురక్షితమైన సమాజం ఏర్పడుతుందని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరవేసి, మహిళా రక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.