తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

గిద్దలూరు పట్టణంలోని రేడియో బావి సెంటర్ వాసులు గత కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఓ ప్రధాన భూ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి విశేష కృషితో ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమమైంది.గిద్దలూరు పట్టణంలోని రేడియో బావి సెంటర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 435/1 కింద అనేక ప్రైవేట్ ఆస్తులు, ఇళ్లు ఉన్నాయి. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా ఈ భూములు పొరపాటున లేదా సాంకేతిక కారణాల వల్ల స్థానిక శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయ భూముల జాబితాలో (నిషేధిత ఆస్తుల కింద) ఉండిపోయాయి.దీని కారణంగా దశాబ్దాలుగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సొంత ఆస్తులను అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోవాలన్నా, కొత్తగా కొనుగోలు చేయాలన్నా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా చట్టపరంగా వీలుకాక నానా అవస్థలు పడ్డారు. ఆస్తి పత్రాలు ఉన్నా, వాటి పై హక్కులు చెలాయించలేని నిస్సహాయ స్థితిలో ఆ ప్రాంత వాసులు ఉండిపోయారు.ఈ దీర్ఘకాలిక సమస్యను అక్కడి ప్రజలు గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఇబ్బందులను, వారి మనోవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే గారు ఈ సమస్య పరిష్కారానికి నడుంబిగించారు.ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన పలుమార్లు జిల్లా కలెక్టర్ ని స్వయంగా కలిసి పరిస్థితిని వివరించారు.రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులతో సమీక్షలు జరిపి, అవి ప్రైవేటు ఆస్తులే అని నిరూపించేలా దస్త్రాలను పరిశీలించి, అధికారులకు తగిన ఆధారాలు సమర్పించడంలో ప్రజలకు అండగా నిలిచారు.ప్రభుత్వ స్థాయిలో నిరంతరం ఒత్తిడి తెచ్చి, ఈ ఫైలు ముందుకు కదిలేలా ఎంతగానో శ్రమించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి నిరంతర కృషి ఫలించి సర్వే నెంబర్ 435/1 లో ఉన్న ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల పై ఉన్న ఆంక్షలను తొలగిస్తూ జిల్లా కలెక్టర్ గారు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం, గిద్దలూరు తహసీల్దార్ వారు కూడా ఆన్లైన్ లో మార్పులు చేయటంతో ఇకపై ఆ ప్రాంత వాసులు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ ఆస్తులను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అలాగే క్రయవిక్రయాలు (అమ్మకాలు, కొనుగోళ్లు) స్వేచ్ఛగా జరుపుకోవచ్చు.కలెక్టర్ ఉత్తర్వులు వెలువడటంతో రేడియోబావి సెంటర్ ప్రాంత వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏళ్ల నాటి తమ ఆస్తుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, తమ కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కి ఆ ప్రాంత ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ దశాబ్దాల కల నెరవేర్చిన ఆయన సేవలను కొనియాడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *