తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాలు, విద్యాసంస్థలు, ప్రజా వేదికలు మరియు వివిధ సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ మహిళలపై నేరాలు, పోక్సో (POCSO) చట్టం, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, గంజాయి మరియు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ఆస్తి నేరాల నివారణ, హెల్మెట్ వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.ఈ కార్యక్రమాల్లో మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టేందుకు అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలు, అత్యవసర సహాయ సేవలు మరియు పోలీసు శాఖ అందిస్తున్న భద్రతా చర్యలను వివరించారు. పోక్సో చట్టం ద్వారా చిన్నారుల రక్షణకు ఉన్న నిబంధనలను వివరించి, వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేసేందుకు అనుసరిస్తున్న కొత్త పద్ధతులపై అవగాహన కల్పిస్తూ, OTPలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎవరికీ తెలియజేయవద్దని సూచించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు.అదేవిధంగా యువతను గంజాయి, మాదకద్రవ్యాలు మరియు ఇతర వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రత్యేక అవగాహన కల్పించారు. గంజాయి మరియు డ్రగ్స్ వినియోగం ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.రోడ్డు ప్రమాదాల నివారణ కోసం హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, అతివేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే గ్రామాల్లో ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశమై ఆస్తి నేరాల నివారణ, దొంగతనాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.ప్రజల సహకారంతోనే నేర రహిత, మాదకద్రవ్య రహిత, సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.