తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు పట్టణంలోని PVR బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జ్ఞానప్రకాశ్ 6 రోజుల ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) సందర్శించారు.ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొంటున్న ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థుల్లో ప్రాథమిక చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల అభివృద్ధికి FLN కార్యక్రమం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు FLN లక్ష్యాల సాధనకు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, వినూత్న కార్యక్రమాలను తల్లిదండ్రులకు తెలియజేసి మరింత మంది విద్యార్థులను ఆకర్షించాలని సూచించారు.గతంలో నిర్వహించిన 75 రోజుల GFLN కార్యక్రమం ద్వారా సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, విద్యార్థుల అభ్యాస ఫలితాల్లో గణనీయమైన పురోగతి నమోదైందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థుల మరలింపునకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించే విధంగా పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ డి. వెంకారెడ్డి, మద్దిపాడు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు, జరుగుమల్లి మండల విద్యాశాఖ అధికారి నాగేంద్రవదన్, రాష్ట్ర వనరుల వ్యక్తులు (SRPs), జిల్లా వనరుల వ్యక్తులు (DRPs) మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.