google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలోని పి ఎం పి. మండల ప్రాథమిక పాఠశాలలో పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా “బడిబాట – బడి పిలుస్తోంది” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని తాటితోటి వరలక్ష్మమ్మ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం గ్రామంలోని వీధులన్నింటిలో ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులను పాఠశాలకు ఆహ్వానించింది.తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావడం ద్వారా వారి విద్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం మరియు భవిష్యత్ అవకాశాలు మెరుగుపడతాయని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలియజేశారు. గ్రామంలోని ప్రతి బాలబాలిక విద్యకు దూరం కాకుండా చూడడం సమాజం మొత్తం బాధ్యత అని పేర్కొన్నారు. కొత్త విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకొని విద్యార్థులను సాదరంగా స్వాగతిస్తూ పాఠశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.అదేవిధంగా శుక్రవారం అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు గ్రామస్తులకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించారు. బాల కార్మికులను పనిలో పెట్టడం చట్టరీత్యా నేరమని, 14 సంవత్సరాల లోపు పిల్లలను ఏ విధమైన ఉపాధిలోనూ నియమించరాదని వివరించారు. అలాగే 14 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను ప్రమాదకర పరిశ్రమలు, పనుల్లో నియమించడం కూడా చట్టవిరుద్ధమని తెలిపారు.
ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, భద్రత మరియు గౌరవప్రదమైన బాల్యం హక్కులుగా రాజ్యాంగం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుందని, వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని వివరించారు. గ్రామంలో ఏ చిన్నారి అయినా పనిలో నిమగ్నమై కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బెల్లంకొండ శ్రీకాంత్, అంగన్వాడీ సిబ్బంది ఎం పార్వతి విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *