తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రజా సమస్యలను సత్వరంగా పరిష్కరించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ విశేష ఫలితాలను ఇస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు తెలిపారు.కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు, ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి గారు, సబ్ కలెక్టర్ శ్రీ హిమవంశి గారు పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో మొత్తం 135 అర్జీలు అందగా, వాటిలో అధిక శాతం రెవెన్యూ మరియు భూ సమస్యలకు సంబంధించినవేనని తెలిపారు.చుక్కల భూములు, ఆన్‌లైన్ రికార్డుల్లో వ్యత్యాసాలు, అసైన్ భూముల పట్టాల సమస్యలు వంటి అంశాలపై వచ్చిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.